అధికారికి చెవులు ఉంటాయి కాని కళ్ళుండవు. (చెప్పుడు మాటలు వింటాడే కాని చూడడు)
- సామెత
నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు ఎండు పూరి.
- సామెత
కంచెయే చేను మేసినఁ గలదె దిక్కు?
- చిలకమర్తి, గయోపాఖ్యానము
తనకన్నా తెలివయిన సబార్డినేటును ఏ అధికారీ భరించలేడు.
- నిరుద్యోగి, కార్యాలయభేతాళవిక్రమార్కీయం
పవరు ఉన్నంతకాలం అందరూ ఏదో ఒక స్వలాభం కోసమే చుట్టూ చేరతారు.
- వెంకటరమణారావు, కొలువు
అధికారము, హోదా, రాజు సభకి ధరించే కిరీటము, బట్టలూ వంటివి. వాటిని ధరించిన మనిషి కొండముచ్చైనా కామధేనువులా కనిపిస్తాడు. వాటిని తీసేగానే కామధేనువయినా కొండముచ్చులా కనిపిస్తాడు.
- వెంకటరమణారావు, కొలువు
సేతిలో పవరుంటే నెత్తికి పొగరెత్తుతుంది.
- రావిశాస్త్రి, అధికారి
మూసి పెట్టినది పైకి దీయుటకు, మాటు
పరచినది చూచుటకు, జెప్పనిది తెలిసికొను
టకు వాంచ జనులకు మహాధికమైయుండును
- పానుగంటి, వీరమతి
అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువు
- గురజాడ, కొండుభట్టీయము
Sunday, November 22, 2009
వేరే గతి లేనప్పుడు బలవంతమూ స్వతంత్రమూ ఒక్కటే అవుతుందేమో.
- రాజమన్నారు, మనోరమ
తలుపులు రెండుకాని, ద్వారం ఒక్కటే
రాత్రి పగలు రెండుకాని, రోజు ఒక్కటే
తల్లిబాధ, పిల్ల ఏడుపు రెండుకాని, ప్రేమ ఒక్కటే
చావుపుట్టుకలు రెండు - జీవితమొక్కటే
- బుచ్చిబాబు, ఒమర్ ఖయాం
జీవుడికి శరీరాలు అద్దె కొంపలు.
- భమిడిపాటి, అద్దె కొంపలు
అద్దం అబద్ధం చెప్పదు.
- ఎమ్వీయల్, యులిసిస్
మన అవసరానికి పక్కవాడి జేబులో డబ్బు ఉండడాన్నే అదృష్టం అంటారు కాబోలు.
అదృష్టం మీద అంత పెద్ద భారాన్ని వెయ్యకూడదు. అదృష్టమనేది మన కోరిక ప్రకారం ప్రార్ధించినా, కోపగించినా, ఏడ్చినా రాదు. అందుకని కాస్త తెలివితేటల్ని ఉపయోగించి ఆ అదృష్టాన్ని జుట్టుపట్టుకుని మనదార్లోకి లాక్కురావాలి.
- ధనికొండ, ఎర్రబుట్టలు
ఇట్టె చంపున ట్లేఁచి బాధించునట్టి
జనులు హానిచేయరు పంటిసలుపువోలె
నున్న జాడయే కనఁబడకుండువారు
ప్రాణములు పీల్తు రిట్టె హృద్వ్యాధిఁబోలె
- పానుగంటి, పాదుకాపట్టాభిషేకము
భూమిలో నిధి, ఫలములో రుచి, నువ్వులలో నూనె కంటి కగపడవు.
- రామకృష్ణశాస్త్రి, ఖుదానంద్
బుద్ధి ఉపయోగిస్తే అంతరాత్మ అదృశ్యమయిపోతుంది.
- రాజమన్నారు, బంధాలు
మనస్సు విరిగాక అతకదు. బలవంతాన అతికినా అతుకు అతుకే.
శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే ఉన్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
- చలం, మ్యూజింగ్స్
Wash basin లో చేపలు పట్టే రకం.
- శ్రీరమణ, న్యూనుడి
(ఏదో cinema లో కూడా ఇలాంటి dialogue విన్నట్టు గుర్తు)
స్వచ్చమైన తియ్యని నీటితో నిండిన కాసారాన్ని పక్కనే పెట్టుకుని మరీచికల వెంట పరుగెత్తే వాడు అజ్ఞాని.
- శ్యామలారాణి, పవిత్ర
అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. తనకు అందని ఆదర్శాలతో హైరానపడడు. అతని కన్నా సుఖం మరెవ్వరికి ఉండదు.
- గోపీచంద్, అసమర్ధుని జీవయాత్ర
(Telugu version of "Ignorance is bliss"?)
రామాయణమంతా విని రామునికి సీతయేమి కావలెనని అడిగినట్లు.
- సామెత
కాసింది వెన్నెలంటే - కోసి గోడౌన్ లో పడేయ్యమన్నాట్ట.
- సామెత
తనకుఁ దెలిసికొన శక్యముగాని దంతయు లేదనుట విపరీత జ్ఞానరూపమున నున్న యజ్ఞానము.
- వరదాచార్యులు, వైశాలిని
అజ్ఞానం అనంతమైనది గనుక, అజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపమే అని అంగీకరించాలి.
- దాసు వామనరావు, గురుశంక
కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకున్నట్లు.
- సామెత
గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట.
- సామెత
వాళ్ళ సంగతి వాళ్ళే చూచుకునే వాళ్ళు ఇతరులని ఎన్నడూ అర్థం చేసుకోలేరు.
- చలం, శశిరేఖ
అతనికి జీవితం సరిగా తెలియదు; అతను తెలుగు సినిమాల మీద పెరిగేడు.
తెలుగు సాహిత్యాన్నే కాదు, తెలుగు భాషనే నిర్లక్ష్యం చేస్తున్న రోజుల్లో, నవల, కథ, కథానిక, కవిత వగైరా ప్రక్రియాభేదాలతో నిమిత్తం లేకుండా రచయితల ప్రసిద్ధిని, ప్రచార శక్తిని, బిరుదాలను, పదవులను, అధికారాలను పాటించకుండా, చిన్నా పెద్దా గ్రంథాలనుంచి, 475 మందికి పైగా రాసిన రచనల నుంచి మరవరాని మాటలను సేకరించి, నలుగురూ వాటిని చదివి, వాడి, తెలుగు సాహిత్యం మీద అభిరుచినీ, అభిమానాన్నీ, ఆదరణనీ పెంచుకోవాలనే అభిలాషతో బూదరాజు రాధాకృష్ణ గారు వెలువరించిన "మరవరాని మాటలు" అనే సంకలనం నుంచి నాకు నచ్చిన మాటలు కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
English భాషకు Random House Webster's Quotationary, తెలుగు భాషకు ఈ మరవరాని మాటలు.