Monday, November 23, 2009

తెల్లజుట్టునాటికి ఆర్డరు పెడితే బట్టతల నాటికి అందిందట.
- శ్రీరమణ, న్యూనుడి

స్వర్గసౌఖ్యం నరకంలో కెళ్తేగాని తెలుసుకోలేం.
- కాంతారావు, బూచీ

ఆశించనిది ఎక్కువైతే అనుభవం తక్కువవుతుంది. ఏమీ ఆశించకపోతే ఉన్నదే అద్భుతంగా అనిపిస్తుంది.
- కవనశర్మ, తూర్పు-పడమర

మినుమంతయు నొక్కటేగదా - కాని వాసెన కుడుము వేరు. రొట్టె వేరు. గారెలు వేరు. దోసెలు వేరు. వట్టి వడియములు వేరు. ఇట్లే వాంఛ యొక్కటే యైనను దత్త్వభేదములఁబట్టి యనుభవభేదము లుండును.
- పానుగంటి, మాలతీమాల

ఏ కులమైతేనేంటి అనుకూలమైతే?
- వెంకటరమణారావు, ఓన్లీ డాటర్

తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట ఉంది.
- సామెత

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట.
- సామెత

బిడ్డను గిల్లి ఊయల వూపినట్లు.
- సామెత

దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి?
- సామెత

చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మర గుడిసెలు.
- సామెత

ధైర్యం సగం జయం. అధైర్యం పూరా అపజయం.
- రావిశాస్త్రి, బుక్కులు

అధికారికి చెవులు ఉంటాయి కాని కళ్ళుండవు. (చెప్పుడు మాటలు వింటాడే కాని చూడడు)
- సామెత

నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు ఎండు పూరి.
- సామెత
కంచెయే చేను మేసినఁ గలదె దిక్కు?
- చిలకమర్తి, గయోపాఖ్యానము

తనకన్నా తెలివయిన సబార్డినేటును ఏ అధికారీ భరించలేడు.
- నిరుద్యోగి, కార్యాలయభేతాళవిక్రమార్కీయం

పవరు ఉన్నంతకాలం అందరూ ఏదో ఒక స్వలాభం కోసమే చుట్టూ చేరతారు.
- వెంకటరమణారావు, కొలువు

అధికారము, హోదా, రాజు సభకి ధరించే కిరీటము, బట్టలూ వంటివి. వాటిని ధరించిన మనిషి కొండముచ్చైనా కామధేనువులా కనిపిస్తాడు. వాటిని తీసేగానే కామధేనువయినా కొండముచ్చులా కనిపిస్తాడు.
- వెంకటరమణారావు, కొలువు

సేతిలో పవరుంటే నెత్తికి పొగరెత్తుతుంది.
- రావిశాస్త్రి, అధికారి

మూసి పెట్టినది పైకి దీయుటకు, మాటు
పరచినది చూచుటకు, జెప్పనిది తెలిసికొను
టకు వాంచ జనులకు మహాధికమైయుండును
- పానుగంటి, వీరమతి

అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువు
- గురజాడ, కొండుభట్టీయము

Sunday, November 22, 2009

వేరే గతి లేనప్పుడు బలవంతమూ స్వతంత్రమూ ఒక్కటే అవుతుందేమో.
- రాజమన్నారు, మనోరమ

తలుపులు రెండుకాని, ద్వారం ఒక్కటే
రాత్రి పగలు రెండుకాని, రోజు ఒక్కటే
తల్లిబాధ, పిల్ల ఏడుపు రెండుకాని, ప్రేమ ఒక్కటే
చావుపుట్టుకలు రెండు - జీవితమొక్కటే
- బుచ్చిబాబు, ఒమర్ ఖయాం

జీవుడికి శరీరాలు అద్దె కొంపలు.
- భమిడిపాటి, అద్దె కొంపలు

అద్దం అబద్ధం చెప్పదు.
- ఎమ్వీయల్, యులిసిస్

మన అవసరానికి పక్కవాడి జేబులో డబ్బు ఉండడాన్నే అదృష్టం అంటారు కాబోలు.
- బీనాదేవి, హరిశ్చంద్రమతి

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
- సామెత

తాగాబోయిన తీర్ధమెదురైనట్లు.

తంతే పోయి బారులో పడ్డట్టు.

వెదకబోయిన ఫైలు చేతికి తగిలినట్టు.

- శ్రీరమణ, న్యూనుడి

అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందంట.
- సామెత

ఎరువిచ్చిన బుక్కు
మళ్ళీ చూడ్డం కూడా గొప్ప లక్కు.
- ఆరుద్ర, ఇంటింటి పజ్యాలు

అదృష్టం మీద అంత పెద్ద భారాన్ని వెయ్యకూడదు. అదృష్టమనేది మన కోరిక ప్రకారం ప్రార్ధించినా, కోపగించినా, ఏడ్చినా రాదు. అందుకని కాస్త తెలివితేటల్ని ఉపయోగించి ఆ అదృష్టాన్ని జుట్టుపట్టుకుని మనదార్లోకి లాక్కురావాలి.
- ధనికొండ, ఎర్రబుట్టలు

ఇట్టె చంపున ట్లేఁచి బాధించునట్టి
జనులు హానిచేయరు పంటిసలుపువోలె
నున్న జాడయే కనఁబడకుండువారు
ప్రాణములు పీల్తు రిట్టె హృద్వ్యాధిఁబోలె
- పానుగంటి, పాదుకాపట్టాభిషేకము

భూమిలో నిధి, ఫలములో రుచి, నువ్వులలో నూనె కంటి కగపడవు.
- రామకృష్ణశాస్త్రి, ఖుదానంద్

బుద్ధి ఉపయోగిస్తే అంతరాత్మ అదృశ్యమయిపోతుంది.
- రాజమన్నారు, బంధాలు

మనస్సు విరిగాక అతకదు. బలవంతాన అతికినా అతుకు అతుకే.
- సుంకర, పిచ్చివాడు

అతి సంతోషం పొందేక కొంచం మందకొడిగా ఉంటుంది మరి.
- లక్ష్మణరావు, అతడు - ఆమె

అసలే ముక్కిడి, పైగా పడిశము అన్నట్టు
- సామెత
చెయ్యి తిరిగిన రచయిత్రి ఇల్లెక్కి నవల రాసిందట.
- శ్రీరమణ, న్యూనుడి

కారు పంపితే కదల్లేదు గాని
కాకి చేత కబురంపితే రాకపోయనా అన్నాట్ట.
- శ్రీరమణ, న్యూనుడి

నిరాశ నిస్పృహ అతివాదానికి కళ్ళు
స్వీయ మానసిక ధోరణి అతివాదానికి వళ్ళు.
- ఛాయారాజ్, శ్రీకాకుళం

ఆడవాళ్ళ నోటికీ గోదారి వరదకీ అడ్డూ ఒడ్డూ లేదనుకుంటాను.
- రాధాకృష్ణ, మనస్తత్వాలు

పిడుగుకు గొడుగు అడ్డమా?
- సామెత

తడిక కుక్కకు అడ్డంగాని మనిషికి అడ్డమా?
- సామెత

మనసు మహామేరువు దాటును, కాలు కందకం దాటదు.
- సామెత

ఆడది లేనిది అడవి. మగాడు లేనిది మఠం.
- సామెత

అడక్కపోతే అమ్మయినా పెట్టదు. పొదుగున పాలున్నప్పటికీ దూడ కుమ్మంది తల్లి చేపదు.
- ఉన్నవ, మాలపల్లి

సవతుల మధ్యమున మాటలాడబోవు కాంతునియొక్క గతి అడుకొత్తులోని వక్కగతి.
- పానుగంటి రాధాకృష్ణ

శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే ఉన్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
- చలం, మ్యూజింగ్స్

Wash basin లో చేపలు పట్టే రకం.
- శ్రీరమణ, న్యూనుడి

(ఏదో cinema లో కూడా ఇలాంటి dialogue విన్నట్టు గుర్తు)
స్వచ్చమైన తియ్యని నీటితో నిండిన కాసారాన్ని పక్కనే పెట్టుకుని మరీచికల వెంట పరుగెత్తే వాడు అజ్ఞాని.
- శ్యామలారాణి, పవిత్ర

అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. తనకు అందని ఆదర్శాలతో హైరానపడడు. అతని కన్నా సుఖం మరెవ్వరికి ఉండదు.
- గోపీచంద్, అసమర్ధుని జీవయాత్ర

(Telugu version of "Ignorance is bliss"?)

రామాయణమంతా విని రామునికి సీతయేమి కావలెనని అడిగినట్లు.

- సామెత

కాసింది వెన్నెలంటే - కోసి గోడౌన్ లో పడేయ్యమన్నాట్ట.

- సామెత

తనకుఁ దెలిసికొన శక్యముగాని దంతయు లేదనుట విపరీత జ్ఞానరూపమున నున్న యజ్ఞానము.

- వరదాచార్యులు, వైశాలిని

అజ్ఞానం అనంతమైనది గనుక, అజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపమే అని అంగీకరించాలి.

- దాసు వామనరావు, గురుశంక

కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకున్నట్లు.

- సామెత

గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట.

- సామెత

వాళ్ళ సంగతి వాళ్ళే చూచుకునే వాళ్ళు ఇతరులని ఎన్నడూ అర్థం చేసుకోలేరు.

- చలం, శశిరేఖ

అతనికి జీవితం సరిగా తెలియదు; అతను తెలుగు సినిమాల మీద పెరిగేడు.

- రావిశాస్త్రి, వియత్నాం విమల వృత్తాంతం

గొడ్రాలు ప్రసవవేదన నెరుగనట్లు బ్రహ్మచారి విరహతాపము నెరుగఁజాలఁడు.

- చిలకమర్తి, కర్పూరమంజరి
ఎవరి తెలివితక్కువ వారికి తెలియదు.

- చిలకమర్తి, ప్రహసనము


భారతయుగానఁ జాణక్య వీరుఁడెట్లు చంపెనో సీతను
జటాయు వంపగముల ద్రుపద పుత్రిక నేరీతిఁ ద్రుంచినాడో
నేఁడు గడతేర్తు నట్లనే నిన్ను నేను.

- తిరుపతి వెంకట కవులు, మృచ్చకటికము

అంతమందికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం.
- శ్రీశ్రీ, శరచ్చంద్రిక
అజ్ఞానాన్ని మించిన శిక్ష లేదు.
- బుచ్చిబాబు, అంతిమ అజ్ఞానం
అచ్చిరాని కాలానికి అడుక్కుతినబోతే, ఉన్న బొచ్చి కాస్త ఊడ్చుకొనిపోయిందిట.
- సామెత
కట్టెలమ్మిన ఊళ్ళో పువ్వులమ్మినట్లు..
- సామెత
అవసరం అయినప్పుడు నడిబజార్లో కలబడక పోవటం గౌరవం కాదు, అగౌరవం.
- వడ్డెర చండీదాస్, హిమజ్వాల
చెట్టుకి ఆకు తొడగటానికీ, పువ్వులు పుయ్యడానికీ ఏ కారణమూ కనబడదు.
- చలం, మ్యూజింగ్స్

నిర్నిమిత్తంబ నిందింప నీకుఁదగునె?
- కంకంటి, ఉత్తర రామాయణము

మరవరాని మాటలు


తెలుగు సాహిత్యాన్నే కాదు, తెలుగు భాషనే నిర్లక్ష్యం చేస్తున్న రోజుల్లో, నవల, కథ, కథానిక, కవిత వగైరా ప్రక్రియాభేదాలతో నిమిత్తం లేకుండా రచయితల ప్రసిద్ధిని, ప్రచార శక్తిని, బిరుదాలను, పదవులను, అధికారాలను పాటించకుండా, చిన్నా పెద్దా గ్రంథాలనుంచి, 475 మందికి పైగా రాసిన రచనల నుంచి మరవరాని మాటలను సేకరించి, నలుగురూ వాటిని చదివి, వాడి, తెలుగు సాహిత్యం మీద అభిరుచినీ, అభిమానాన్నీ, ఆదరణనీ పెంచుకోవాలనే అభిలాషతో
బూదరాజు రాధాకృష్ణ గారు వెలువరించిన "మరవరాని మాటలు" అనే సంకలనం నుంచి నాకు నచ్చిన మాటలు కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

English భాషకు Random House Webster's Quotationary, తెలుగు భాషకు ఈ మరవరాని మాటలు.